
Secunderabad : సికింద్రాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయం (Muthyalama temple) లో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయం నుంచి పెద్ద శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. ఉదయం నుంచి గుడి దగ్గర గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు.. అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా ముత్యాలమ్మ గుడి (Muthyalama temple) పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ మెట్రోపోలీస్ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్ 3, 4 అంతస్తుల్లో ఏకంగా 50 గదులను పలువురు దుండగులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మెట్రో పోలీస్ హోటల్‌లో నివాసముంటే సలీం సల్మాన్ ఠాకూర్ అనే వ్యక్తి ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హోటల్ నుంచి మసీదు వైపు వెళ్తుండగా విగ్రహం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. ఆలయంపై దాడి అనంతరం వారంతా పారిపోయారని, రిసెప్షన్‌లో రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వివరాలు సేకరించి వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
కాగా ముత్యాలమ్మ ఆలయంపై దుండగులు దాడి చేసిన సంఘటనపై స్థానికులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సైతం ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్, మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ సహా పలువురు ఘటనను తీవ్రంగా ఖండించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..