
Rs.500 Gas Cylinder | తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందుతోంది. అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే.. వినియోగదారులు పాత ధరనే చెల్లించాలి. మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులైనా సరే పాత ధరనే చెల్లించాలి. సబ్సిడీ డబ్బులను తర్వాత ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది.
కాగా మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులు కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు జమ కాకపోతే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేస్తే డబ్బులు ఆగిపోవటానికి గల కారణాలు చెబుతారు. అలాగే ఎప్పుడు పరిష్కారం అవుతాయో చెబుతారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. తొలిదశలో దాదాపుగా 40 లక్షల మందిని ఎంపిక చేసినట్లు గణంకాలు సూచిస్తున్నాయి. ఆయా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని చెబుతున్నారు. ఇంకా పథకం వర్తించకపోతే మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.