
Nagpur Violence News Updates : నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు, విధ్వంసం, దహనకాండకు దారితీసింది. నిరసనతో ప్రారంభమైన ఘటనలు రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నేతలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి నిలయం, అందువల్ల శాంతిని కాపాడటానికి ప్రభుత్వం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంటుంది.
మహారాష్ట్ర (Maharastra)లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ ఇటీవల కాలంలో ఉధృతం కావడంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారితీసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నాగ్‌పూర్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, శాంతిభద్రతలను కాపాడటానికి తదుపరి నోటీసు వచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
నివేదికల ప్రకారం ఘర్షణల్లో 22 మంది పోలీసులు గాయపడ్డారు. సుమారు 65 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొత్వాలి, గణేష్‌పేట్, తహసీల్, లకద్‌గంజ్, పచ్‌పావోలి, శాంతినగర్, సక్కర్‌దార, నందన్వన్, ఇమామ్‌వాడ, యశోధరనగర్, కపిల్‌నగర్‌లలో పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఉత్తర్వులో పేర్కొన్నట్లుగా, మార్చి 17న, విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్‌కు చెందిన దాదాపు 200 నుండి 250 మంది సభ్యులు నాగ్‌పూర్‌లోని మహల్‌లోని శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్ కు మద్దతుగా గుమిగూడారు.
పుకార్లు వ్యాపించడంతో
సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పలువురు నినాదాలు చేస్తూ, ఆవు పేడతో నిండిన ఆకుపచ్చ వస్త్రాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం, భల్దార్‌పురా ప్రాంతంలో దాదాపు 80 నుండి 100 మంది ప్రజలు గుమిగూడారు.
కాగా కర్ఫ్యూ కాలంలో, అత్యవసర వైద్య కారణాల వల్ల తప్ప మరే ఇతర కారణాల వల్ల ఎవరూ ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, లేదా ఐదుగురు కంటే ఎక్కువ మంది ఇంటి లోపల గుమిగూడకూడదు. అలాగే, ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయొద్దనిఆదేశాలు జారీ చేశారు.
హంసపురి హింస
Hansapuri Violence : ఉద్రిక్తతలు చెలరేగడంతో, హంసపురి ప్రాంతంలో కొత్త హింస చెలరేగింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాలపై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు.. రాళ్ళు రువ్వారు. ముసుగు ధరించిన దుండగులు పదునైన ఆయుధాలు, సీసాలతో ఆస్తులను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పంటించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. గందరగోళంలో 8 నుండి 10 వాహనాలు కాలిపోయాయని మరొక స్థానికుడు ధ్రువీకరించారు.
Nagpur Violence : కారణమేంటి?
ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక సంస్థ చేపట్టిన ఆందోళనలో ముస్లిం సమాజం పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారనే పుకార్లు వ్యాపించాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మధ్య నాగ్‌పూర్ లోని ప్రాంతాలలో హింస చెలరేగింది. నగరంలో అనేక మంది రాళ్ల దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రధాన కార్యాలయం ఉన్న మహల్ (Mahal) ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ల సందర్భంగా 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతలో, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.