Tuesday, March 4Thank you for visiting

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Spread the love

Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది.
మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజారు నివసిస్తున్నారు. మందమర్రి శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలోని షెడ్డు లో మేకలను పెంచుతున్నారు. కాగా మేకల మందలో నుంచి రెండు మేకలను దొంగిలించారనే అనుమానంతో మేకల కాపరితో పాటు అతడి స్నేహితుడు ఓ తాపి మేస్త్రీని షెడ్డులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పశువుల కాపరి తేజతోపాటు దళిత యువకుడైన చిలుముల కిరణ్ ను షెడ్డు వద్దకు పిలిపించి… తాళ్లతో తలకిందులుగా కట్టి కింద నుంచి పొగ పెట్టి వారిద్దరిని తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయట కు వెళ్లిన కిరణ్ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరిలో గాలించారు. తన సోదరుడిని కట్టేసి కొట్టిన విషయం తెలిసి బాధితుడి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నలుగురి అరెస్ట్
తేజ, కిరణ్ ను వేలాడదీసి తీవ్రంగా కొట్టిన ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. తమ అక్క కొడుకు కిరణ్ కనిపించడం లేదని, బాధితుడి చిన్నమ్మ సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. ఈ కేసులో మేకల యజమాని కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్, పనిమనిషి నరేష్ పై 342, 367 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆదివారం ఈ నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం నలుగురినీ రిమాండ్ కు తరలించారు. కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కోసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version