
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందని, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే నమ్మకం లేదని ఇక దేశ ప్రజలు ఎలా విశ్వసిస్తారని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుందని, 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సున్నా వచ్చిందని గుర్తుచేశారు. 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని అన్నారు.
కేజ్రీవాల్ దోపిడీ పాలనను తిరస్కరించారు..
ఢిల్లీ అభివృద్ధిలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం విఫలమైందని, . దోపిడీ పాలనను కొనసాగించిన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ద్వారా, ఆప్ పార్టీ తమ నీచ రాజకీయాలను బయటపెట్టుకుందని, హర్యానా రాష్ట్ర ప్రభుత్వమైన బిజెపి యమునా నదిలో విషం కలిపిందని నీచపు ఆరోపణలు చేసి దిగజారారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతారని కాంగ్రెస్ గతంలో తప్పుడు ప్రచారం చేసిందని, అయితే ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి, తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామంటూ ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచున్నారని, ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చిందన్నారు. కానీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడించి, గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోడీ (PM Narendra Modi) నాయకత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను ప్రజలు గెలిపించారని తెలిపారు.
Delhi Election Results : కేజ్రీవాల్ నిజస్వరూపం తెలిసుకున్నారు..
స్వతంత్ర భారతదేశ చరిత్రలో, జైలు నుంచి పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని అవినీతి ఆరోపణలతో, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి దుర్మార్గపు ఆలోచనతో కేజ్రీవాల్ పాలన అందించారన్నారు. అందుకే కేజ్రీవాల్ డ్రామాలకు ప్రజలు అర్థం చేసుకుని తీర్పునిచ్చారని తెలిపారు. కేజ్రీవాల్ గతంలో సామాన్య ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చామంటూ అనేక రకాలుగా ఉపన్యాసాలిచ్చారు. కానీ ప్రజలు ఆయన నిజస్వరూపం తెలిసుకుని ఎన్నికల్లో పక్కనబెట్టారు. 2025 లో కాదు కదా… 2050 లో కూడా ఆప్ ను ఓడించలేరని, ఆప్ ను ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలంటూ అహంకార పూరితమైన ఉపన్యాసాలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. కేజ్రీవాల్ కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. లిక్కర్ స్కాం, వాటర్ స్కాం, రాజ్ మహల్ లా సీఎం నివాస నిర్మాణం, ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, అబద్ధాల ప్రచారంలో, ప్రజలను రెచ్చగొట్టడంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండూ పోటీ పడ్డాయని, తల్లిలాంటి దేశాన్ని ఇతర దేశాల వేదికల నుంచి రాహుల్ గాంధీ తక్కువ చేసి, విమర్శించి మాట్లాడారని మండిపడ్డారు. అందుకే మూడోసారి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు గుండుసున్నాతో బుద్ధి చెప్పారన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.