
Hyderabad Metro Phase II : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమయ్యాయి. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనా వ్యయంతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలు అప్పగించగా ఆ సంస్థ ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో డీపీఆర్‌ను రెడీ చేస్తున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 మెట్రో కారిడార్లకు వేరువేరుగా డీపీఆర్‌లను సిద్ధం చేశారు. మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రో మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడగిస్తూ దానికి ప్రత్యేకంగా డీపీఆర్ సిద్ధం చేయగా, మిగతా 5 కారిడార్లకు డీపీఆర్‌లను ఆగస్టు 15 నాటికి రూపొందించనున్నారు. 5 మెట్రో కారిడార్లకు వేర్వేరుగా నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించాలని భావిస్తున్నారు.మొత్తం ఒకే సంస్థకు ఇవ్వకుండా 5 కారిడార్లను వేర్వేరు సంస్థలకు ఇవ్వడం వల్ల ఒకే సమయంలో అన్ని కారిడార్ల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
2029 నాటికి అందుబాటులోకి..
మెట్రో రెండో దశను పూర్తిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే 50శాతం నిధులను సమకూర్చుకోనున్నాయి. మొత్తం వ్యయంతో కేంద్ర ప్రభుత్వం 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం భరిస్తే, మిగతా 50 శాతంలో 45 శాతం రుణాల ద్వారా, మరో 5 శాతం వ్యయాన్ని పీపీపీ విధానంలో నిధులను సమకూర్చుకునేలా రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. 2029 నాటికి రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం 5 కారిడార్లలో నిర్మించే మెట్రో రెండో దశకు కారిడార్ల వారీగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు సుమారు 31 కి.మీ మెట్రోకు రూ.8500 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పోర్టు కారిడార్ నిర్మాణంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సంస్థ సైతం భాగస్వామిగా ఉంటుందని తెలుస్తోంది.
ఓల్డ్ సిటీ మెట్రోకు భారీగా వ్యయం
Hyderabad Metro Phase II : ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ నిర్మించే రోడ్డు విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది. ఆ మార్గాన్ని 60 నుంచి 80 అడుగుల వరకు విస్తరించేందుకు పెద్ద ఎత్తున ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. ఫలితంగా పరిహారం కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఈ మార్గంలో విద్యుత్ స్తంభాలు, తాగునీటి లైన్లు, డ్రెయినేజీలు, కేబుల్స్‌ను మరో చోటుకు తరలించాల్సి ఉంటుందని దీనికి దాదాపు రూ.200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు మతపరమైన కట్టడాలు సైతం 100కు పైగా ఉన్నాయి. వీటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా నిర్మాణాలు చేపట్టడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. 7.5 కి.మీ మెట్రో కారిడార్‌లో భారీగా ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. ప్రతిపాదిత మెట్రో మార్గంలో సుమారు 1100 లకు పైగా ఆస్తులు ఉన్నాయని, వాటన్నింటికీ పరిహారాన్ని చెల్లించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగం ఆస్తుల సేకరణకే ఖర్చుచేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీని ప్రకారం.. ఓల్డ్ సిటీ ట్రోకే రూ.2,300 కోట్ల దాకా వ్యయం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..