
AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. దీని కారణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది.
సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది.
ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిందింది.
విజయవాడకు భారీ వర్ష సూచన
Vijayawada Floods | మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపుకు గురైంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మరోసారి భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..