
Railway Line | రాష్ట్ర ప్రజలకు శుభవార్త… తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒరిస్సాకు మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం దిశగా మార్గం సుగమమం అయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా ప్రాంతాల మీదుగా ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.3592 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లనున్న మొదటిసారి రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు కొత్తగా రైల్వే సేవలు అందబాటులోకి వస్తాయి. ఆయా ప్రాంతాలు కూడా త్వరితగతిన ప్రగతిబాట పట్టనున్నాయి. అయితే తెలంగాణ-ఒరిస్సా రైల్వే లైన్ నిర్మాణానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి రైల్వే శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దట్టమైన అడవులతోపాటు కొండలు, గుట్టలు కలిగిన ఈ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
నేరుగా భద్రాచలానికి రైలు..
భద్రాచల పుణ్యక్షేత్రానికి నేరుగా రైలు కనెక్టివిటీ ఇప్పటివరకు లేదు. భక్తులు, సాధారణ ప్రజలు భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) స్టేషన్ వరకు రైలు ప్రయాణించి అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలానికి బస్సులు, లేదా ప్రైవేట్ వాహనాల్లో చేరుకుంటున్నారు. అయితే కొత్తగా రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. నేరుగా భద్రాచలం వరకు రైలులో చేరుకోవచ్చు. దీనివల్ల సాధారణ ప్రజలతోపాటు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఒడిశా జైపూర్ నుంచి ప్రస్తుతం రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ ను మరింత విస్తరించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను కలిపేందుకు ఈ మార్గాన్ని పొడగిస్తున్నారు. ఈ కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. కూనవరం, ఎటపాక మండలాల్లోని గ్రామాల మీదుగా కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు వస్తుంది.
మరోవైపు ఒరిస్సాలోని మల్కన్‌గిరికి ఇప్పటివరకు రైలు లైన్ లేదు. ఈ ప్రాంత ప్రజలు రైలు ఎక్కేందుకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌కు వెళుతున్నారు. అయితే కొత్త రైల్వే లైన్ (New Railway Line) నిర్మిస్తే.. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, వరంగల్ మీదుగా మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్ చేరుకోవడం సులభతరమవుతుంది. మరోవైపు భద్రాచలం పట్టణాన్ని పెద్దపల్లి రైల్వే జంక్షన్ తో కలిపేందుకు రైల్వేశాఖ భావిస్తోంది. దీంతో భద్రాచలం, మల్కాన్‌గిరి వాసులు పెద్దపల్లి, రామగుండం, నాగ్‌పూర్ మీదుగా న్యూఢిల్లీకి రైలులో ప్రయాణించవచ్చు. కొత్త రైల్వే పూర్తయితే కాకినాడ పోర్ట్, ఒడిశా, తెలంగాణలోని గనులు, పరిశ్రమల మధ్య దూరం తగ్గిపోతుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..