
Bahraich Violence : భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో అక్టోబరు 13న దుర్గా విగ్రహం నిమజ్జనం ఊరేగింపు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం గుండా వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో హింస చెలరేగింది. దుండగులు 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రాను అత్యంత దారుణంగా కాల్చి చంపడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో పొలీసులు ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేయగా 55 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
కాగా, రామ్ గోపాల్ మిశ్రాను కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్ కుమారులు, హత్య కేసులో నిందితులైన సర్ఫరాజ్, ఫహీమ్ నేపాల్ పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు యత్నించగా కాల్పులు జరిపారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో సర్ఫరాజ్, ఫహీమ్ కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. వీరిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ ఎన్‌కౌంటర్ సందర్భంగా ప్రధాన నిందితుడైన అబ్దుల్ హమీద్‌తో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు.