
AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంటనే పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లకార్డు ఆధారంగా తీసుకొంటే 1.47 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండర్ ను అందించాల్సి ఉంటుంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ.3,640 కోట్ల వరకు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తే.. ఏడాదికి 1,763 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అయితే ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ప్రతి ఇంటికీ సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర విజయవాడలో రూ.825గా ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 2,478 మేర లబ్ధి చేకూరనుంది. దీపంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద 50 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ఎన్డీయే ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) ను ప్రారంభించింది.ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 9.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు మరో ఆరు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించాయి. మొత్తంగా ఏపీలో 75 లక్షల మంది వివిధ పథకాల కింద గ్యాస్ తీసుకుంటున్నారు. 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్‌పై 300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ అందిస్తున్నది. వీరికి ఒక్కో సిలిండర్‌పై 525 చొప్పున రాయితీ ఇవ్వాల్సి ఉంది. మూడు సిలిండర్లకు ఏడాదికి 153 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. దీపం, ఇంధన కంపెనీలిచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్‌కు రూ.825 చొప్పున ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్లకు 1,610 కోట్లు భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తంగా 1763 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..